Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమాన త‌యారీ దిగ్గ‌జం బోయింగ్‌లో కీల‌క ప‌రిణామం.. సీఈఓ రాజీనామా!

Boeing CEO Dave Calhoun to step down this year
Advertisement
  • ఈ ఏడాది చివ‌రికి సీఈఓ డేవ్ కాల్హౌన్ త‌న ప‌ద‌వి నుంచి వైదొలుగుతార‌ని బోయింగ్ ప్ర‌క‌టన‌
  • 2024 జ‌న‌వ‌రిలో 737 మ్యాక్స్ విమానం డోర్ ఊడిన ఘ‌ట‌న‌తో కంపెనీపై విమ‌ర్శ‌లు
  • క‌మ‌ర్షియ‌ల్ విమానాల విభాగం అధ్య‌క్షుడు, సీఈఓ స్టాన్ డీల్ కూడా త్వ‌ర‌లో రిటైర్ అవుతార‌ని వెల్ల‌డి
  • ఆయ‌న స్థానంలో స్టెఫానీ పోప్ బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని స్పష్టీకరణ 
  • బోర్డు ఛైర్మ‌న్‌గా స్టీవ్ మోలెన్‌కోఫ్ ఉంటార‌ని కంపెనీ ప్ర‌క‌ట‌న‌
Advertisement
అమెరికాలోని విమాన త‌యారీ దిగ్గ‌జ సంస్థ‌ బోయింగ్‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) డేవ్ కాల్హౌన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2024 చివ‌రి నాటికి ఆయ‌న త‌న ప‌ద‌వి నుంచి వైదొలుగుతార‌ని బోయింగ్ కంపెనీ తాజాగా ప్ర‌క‌టించింది. 

కాగా, ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఆ సంస్థకు చెందిన 737 మ్యాక్స్ విమానం డోర్ ఊడిప‌డిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి బోయింగ్ కంపెనీ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. ఇలాంటి స‌మ‌యంలో ఈ కీల‌క ప‌రిణామం చోటు చేసుకోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. 

అలాగే బోయింగ్ సీఈఓతో పాటు క‌మ‌ర్షియ‌ల్ విమానాల విభాగం అధ్య‌క్షుడు, సీఈఓ స్టాన్ డీల్ కూడా త్వ‌ర‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయనున్నార‌ని వెల్ల‌డించింది. ఆయ‌న స్థానంలో స్టెఫానీ పోప్ బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని స్ప‌ష్టం చేసింది. అంతేగాక బోర్డు ఛైర్మ‌న్‌గా స్టీవ్ మోలెన్‌కోఫ్ ఉంటార‌ని కంపెనీ తెలియ‌జేసింది. 

ఇక బోయింగ్ విమాన కంపెనీకి 737 మ్యాక్స్ విమానాలు క‌ళంకాన్ని తెచ్చిపెట్టిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ఇండోనేషియా, ఇథియోపియాల్లో రెండు బోయింగ్‌-737 మ్యాక్స్ విమానాలు కూలి 346 మంది చ‌నిపోవ‌డం జ‌రిగింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఏడాదిన్న‌రకు పైగా ఈ ర‌కం విమానాలను పూర్తిగా ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింది. 

ఇక 2024 జ‌న‌వ‌రి 5వ తేదీన అలా‌స్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 16 వేల అడుగుల ఎత్తులో ఉండ‌గా డోర్ ఊడిపోయింది. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో సంస్థ‌పై నియంత్ర‌ణ సంస్థ‌ల నిఘా మ‌రింత‌ క‌ఠిన‌త‌రంగా మారింది. నాణ్య‌త‌, భ‌ద్ర‌త విష‌యంలో సోదాలు తీవ్ర‌త‌రం కావ‌డంతో ఉత్ప‌త్తి కూడా నిలిచిపోయింది. 

ఇటీవ‌ల యూఎస్‌లో జ‌రిగిన విమాన కంపెనీల సీఈఓల భేటీలోనూ ఈ అంశం ప్ర‌స్తావ‌న‌కు రావ‌డం, కెంపెనీతో పాటు సీఈఓపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే తాను క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు డేవ్ కాల్హౌన్ ఉద్యోగుల‌కు రాసిన లేఖ‌లో పేర్కొన‌డం జ‌రిగింది.
Advertisement
Advertisement
Dave Calhoun
Boeing CEO
Step down
USA

More Telugu News